తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. ఆయన పలమనేరు గోశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ గోశాలలోని పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, అవసరమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నట్లు తెలిపారు. పశువులను మేత కోసం రోజుకు ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు వదలకుండా, ఉదయం ఒకేసారి మేతకు వదిలి సాయంత్రం షెడ్లకు తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఇప్పటికే 13 ఎకరాల్లో పచ్చి మేత అందుబాటులో ఉందని, గోశాలకు అనువైన భూమిని గుర్తించి మరింత విస్తీర్ణంలో పచ్చి గడ్డి సాగు చేయాలని సూచించారు. ప్రతి షెడ్డులో పశువులకు అందిస్తున్న దాణా, షెడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పరిశుభ్రత, వ్యాధుల నివారణకు అందిస్తున్న మందుల వివరాలను రోజువారీగా నమోదు చేసి బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న పిల్లల సంరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో, పశువుల సంరక్షణకూ అంతే స్థాయిలో బాధ్యత వహించాలని సూచించారు. పశువులకు తగిన నీడ కల్పించేందుకు విస్తృతంగా చెట్ల మొక్కలు నాటాలని కోరారు.
బెంగుళూరులోని శ్రీ శ్రీ గోశాలను సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు పలమనేరులోని గోశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, పలమనేరు ప్రత్యేక అధికారి డా. చైతన్య, వెటర్నరీ మేనేజర్లు డా. అనిల్ కుమార్, శివ మనోహర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
The post పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
Categories: