వికారాబాద్ జిల్లా : భారత దేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దిక్సూచిగా మారారని కొనియాడారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం దక్కడం, నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సమానత్వం, న్యాయం, ఆత్మ గౌరవం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు మంత్రి.
ప్రపంచంలో జాతి వివక్ష, బానిసత్వం వంటి వివక్షలు ఉన్నప్పటికీ, మన దేశంలో అంటరానితనం అనే అమానవీయ వ్యవస్థ ఉండేదన్నారు. చతుర్వర్ణ వ్యవస్థ, కఠిన కుల వ్యవస్థ సమాజాన్ని తీవ్రంగా విభజించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయాలు, అసమానతలను గౌతమ బుద్ధుడు, బసవేశ్వరుడు వంటి సంస్కర్తలు సవాలు చేశారని గుర్తు చేశారు. వారు మానవత్వం, సేవ, ఆత్మశోధన వంటి విలువలను బోధించారని అన్నారు దామోదర రాజ నరసింహ. మహాత్మా జ్యోతిరావు ఫూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, విద్య ద్వారా సమాజ మార్పును సాధించాలని నమ్మారని అన్నారు. మహిళల కోసం తొలి పాఠశాల స్థాపించి మహిళా సాధికారతకు పునాది వేశారని ప్రశంసించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిన్ననాటి నుంచే వివక్షను ఎదుర్కొని, విద్యతో ఎదిగి భారత రాజ్యాంగ నిర్మాతగా నిలిచారని కొనియాడారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను దేశానికి అందించారని అన్నారు. విద్య, సంఘటితం, పోరాటం ద్వారా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. దళితుల మాత్రమే కాదు, పేదలు, వెనుకబడిన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు మంత్రి. బాబు జగ్జీవన్ రామ్ కూడా వివక్షను ఎదుర్కొని, దేశ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి, దళితుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని చెప్పారు. ఈ మహనీయుల లక్ష్యం సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణమే అని అన్నారు.
The post మహోన్నత మానవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మహోన్నత మానవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
Categories: