తమ సినిమా గొప్పదనం గురించి.. అలాగే ఆర్టిస్టుల నటన గురించి విడుదలకు ముందు మాట్లాడుతూ.. అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారని.. తమ సినిమాకు నేషనల్ అవార్డు గ్యారెంటీ అని చిత్ర బృందాలు హైప్ ఇచ్చుకోవడం మామూలే. ఐతే ఒక చిత్ర బృందం కాకుండా బయటి వాళ్లు దాని గురించి ఇలా మాట్లాడుకోవడం అరుదే. వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న రష్మిక మందన్నా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి చర్చే జరుగుతోంది.
దర్శకుడిగా తన తొలి చిత్రం ‘చి ల సౌ’తో నేషనల్ అవార్డు సాధించిన రాహుల్ రవీంద్రన్.. మరోసారి అలాంటి మంచి సినిమానే తీశాడంటున్నారు. ‘మన్మథుడు-2’ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న రాహుల్.. ఈసారి పూర్తిగా తన పంథాలోనే ‘ది గర్ల్ ఫ్రెండ్’ తీశాడు.
ఇటీవలే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మోడర్న్ రిలేషన్‌షిప్స్ మీద కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకుని.. హృద్యంగా ఈ సినిమాను రూపొందించినట్లున్నాడు రాహుల్. ఆల్రెడీ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులకు చిత్ర బృందం సినిమాను చూపించిందట. చూసిన వాళ్లందరూ గొప్ప సినిమా అని కొనియాడినట్లు సమాచారం. సెన్సార్ బోర్డు నుంచి కూడా సినిమాకు ప్రశంసలు దక్కాయట. విడుదల తర్వాత ఈ సినిమా కాన్సెప్ట్ చర్చనీయాంశం అవుతుందని అంటున్నారు.
అలాగే రష్మిక పెర్ఫామెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుందని.. సినిమాతో పాటు ఆమెకూ జాతీయ పురస్కారం దక్కే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో ఒక డిస్కషన్ నడుస్తోంది. రష్మికకు జోడీగా నటించిన దీక్షిత్ శెట్టి పెర్ఫామెన్స్ సైతం వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఐతే ఇదంతా సినిమాకు హైప్ తీసుకురావడానికి జరుగుతున్న డిస్కషనా.. లేక నిజంగానే సినిమాలో అంత కంటెంట్ ఉందా అన్నదీ చూడాలి. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.