ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా టై కాలేదే, సూపర్ ఓవర్ చూడలేకపోతున్నామే అని ఫీలైన అభిమానులకు.. ఆదివారం రాత్రి లోటు తీరిపోయింది. పరమ బోరింగ్‌గా సాగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కాస్తా.. ఆఖర్లో రసవత్తరంగా మారి టై అయింది. తర్వాత సూపర్ ఓవర్లో లక్నో.. నరైన్ బౌలింగ్‌లో అనూహ్యంగా ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతా సునాయాసంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఐతే ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కంటే చర్చనీయాంశం అయిన టాపిక్ ఇంకొకటి ఉంది. మొదట కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్నపుడు ఆ జట్టు బ్యాటర్ ఆంగ్క్రిష్ రఘువంశీ ఔటైన తీరే తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ కుర్రాడిని ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద ఔటివ్వడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రఘువంశీ ఒక బాల్‌ను షాట్ ఆడాక పరుగు కోసం ముందుకు కదిలాడు. ఐతే అవతలి బ్యాటర్ గ్రీన్ పరుగుకు నిరాకరించడంతో సగం పిచ్ వరకు వచ్చాక, వెనక్కి మళ్లాడు రఘువంశీ. ఐతే ముందు పరుగు తీసినపుడు పిచ్‌కు కుడివైపు పరుగెత్తుతూ వచ్చిన రఘువంశీ.. వెనక్కి మళ్లినపుడు ఇంకో వైపు నుంచి పరుగెత్తాడు. ఫీల్డర్ అటు వైపే బంతిని త్రో విసిరాడు.
క్రీజులోకి డైవ్ చేసే ప్రయత్నం చేయగా.. రఘువంశీకి బాల్ తగిలింది. దీనిపై లక్నో జట్టు అప్పీల్ చేయగా.. ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డు పడ్డాడనే కారణంతో మూడో అంపైర్ రఘువంశీని ఔటిచ్చేశాడు. కానీ ఆ వీడియోను గమనిస్తే.. రఘువంశీ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని అర్థమవుతుంది. అతను రనౌట్ తప్పించుకోవాలని అప్రయత్నంగా దిశ మార్చుకున్నాడు, డైవ్ చేశాడు తప్ప.. అతడి తప్పేమీ అందులో లేదని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ విషయాన్ని గుర్తించి అంపైర్ గుర్తించకపోయినా, లక్నో అయినా అర్థం చేసుకుని.. అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాల్సింది. కానీ లక్నో ఆ పని చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ఇటు అంపైర్లపై, ఇటు లక్నో జట్టుపై తీవ్ర విమర్శలు తప్పట్లేదు. ఆ జట్టు మ్యాచ్ ఓడిపోవడంతో రఘువంశీకి చేసిన అన్యాయానికి ఆ జట్టుకు బాగానే అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
𝐖𝐇𝐀𝐓 𝐉𝐔𝐒𝐓 𝐇𝐀𝐏𝐏𝐄𝐍𝐄𝐃?! Mix-up. Long turn. Third umpire drama… & Raghuvanshi is given OUT for obstructing the field! Just the 4⃣th instance of a batter being given out for obstructing the field in TATA IPL #TATAIPL 2026 #LSGvKKR | LIVE NOW… pic.twitter.com/WRgr608Odb— Star Sports (@StarSportsIndia) April 26, 2026