హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాల్కాన్ ఇన్ వాయిస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ దీప్ కుమార్ ను మంగళవారం హైదరాబాద్ సీఐడీ చీఫ్ చారు సిన్హా అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెస్సర్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం, నమ్మక ద్రోహం, మోసం ,క్రిమినల్ కుట్రకు పాల్పడి అనధికారికంగా డిపాజిట్లను సేకరించారు.
నిందితులు ఒక మోసపూరిత వెబ్‌సైట్ (www.falconsgrup.com) తో పాటు మొబైల్ అప్లికేషన్‌ను సృష్టించారు. ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల పేర్లతో నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఒప్పందాలను సృష్టించారు. స్వల్ప కాలంలో అధిక రాబడులు ఇస్తామని వాగ్దానాలు చేసి పెట్టుబడిదారులను మోసగించారు. మొత్తం మీద 7,056 మంది డిపాజిటర్ల నుండి సుమారు రూ. 4,215 కోట్లు సేకరించారు. వీరిలో 4,065 మంది బాధితులను రూ. 792 కోట్లకు మోసం చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, సైబరాబాద్‌లోని EOW పోలీస్ స్టేషన్‌లో సెక్షన్లు 316(2), 318(4), 61(2) BNS , TSPDEF చట్టం, 1999లోని సెక్షన్ 5 కింద 2025 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ నంబర్లు 10, 11 అండ్ 12 నమోదు చేశారు. ఈ కేసులను తెలంగాణ సీఐడీకి బదిలీ చేశారు.
ప్రధాన నిందితుడు ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఎండి అయిన అమర్‌దీప్ కుమార్‌ను లుక్ అవుట్ సర్క్యులర్ ఆధారంగా ఇరాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు మరియు ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌తో సహా 11 మంది నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, రూ. 8 లక్షల నగదు, 21 తులాల బంగారం, రూ. 20 కోట్ల విలువైన RDP షేర్లు , రూ. 8 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌లతో సహా ఆస్తులను (మొత్తం సుమారు రూ. 43 కోట్లు) గుర్తించారు .
The post ఫాల్కన్ ఇన్వాయిస్ ఎండీ అమర్ దీప్ కుమార్ అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఫాల్కన్ ఇన్వాయిస్ ఎండీ అమర్ దీప్ కుమార్ అరెస్ట్
Categories: